

చాట్ జీపీటీ సురక్షితం కాదని ఆరోపణలు చేసిన 3 నెలలకే ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. దీనిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో అతడిది హత్యా.. ఆత్మహత్యా? అనే చర్ఛ ముమ్మరంగా సాగుతుంది. అసలేం జరిగిందంటే..
చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భారత సంతతికి చెందిన అతడు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని బుకానన్ స్ట్రీట్ అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద రీతిలో మృతి చెంది కనిపించారు. బాలాజీ సూసైడ్ చేసుకున్నట్లు మెడికల్ ఆఫీసర్ తెలిపారు. అతని మరణం వెనుక ఎటువంటి ఆధారాలు లేవని ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు సైతం ఇది ఆత్మహత్యగా తేల్చారు. నిజానికి బాలాజీ నవంబర్ 26న మరణించగా.. ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భారత సంతతికి చెందిన బాలాజీ OpenAIలో సైంటిస్టుగా పని చేశారు. బాలాజీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం నవంబర్ 2020 నుంచి ఆగస్టు 2024 వరకు OpenAIలో పనిచేశారు. ఓపెన్ ఏఐ ఆపరేషన్లు, అనుసరిస్తున్న విధానాలు ఆందోళనకరంగా ఉన్నట్లు గతంలో తన రీసెర్చ్ ద్వారా బాలాజీ వెల్లడించారు. ఆ కంపెనీ పలు కాపీరైట్ల ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ విషయమై OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్‌తో వైరం నెలకొంది. ఈ ఆరోపణలు చేసిన 3 నెలల తర్వాత బాలాజీ మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.